Tuesday, 4 June 2013

కాంగ్రెస్‌వే అయితే ఇతర రాష్ట్రాల్లో లేవే?

కాంగ్రెస్‌వే అయితే ఇతర రాష్ట్రాల్లో లేవే?
మీ పార్టీ పూర్తి పేరు మీకు తెలుసా బొత్సా?
వైఎస్ ఇచ్చిన ఆ రెండు హామీలూ అమలు చేయలేదేం?

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2004 నుంచి చేపట్టిన సంక్షేమ పథకాలు అక్షరాలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డివేనని, అవెంత మాత్రం కాంగ్రెస్ పార్టీవి కానే కావని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ పథకాలన్నీ కాంగ్రెస్‌వేనని, వైఎస్‌వి కావని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై భూమన మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ మొదలు ఫీజుల చెల్లింపు పథకం వరకూ కాంగ్రెస్ పథకాలే అయితే 2004 ఎన్నికల సందర్భంగా కాని, 2009లోగాని జాతీయ స్థాయిలో ఆ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టో(ప్రణాళిక)లో వీటిని ఎందుకు చేర్చలేదని కరుణాకర్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. పోనీ.. కనీసం ఏ ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనైనా ఇలాంటి పథకాలున్నాయేమో చెప్పండి అని ఆయన డిమాండ్ చేశారు.

పేదల కోసం వైఎస్ చేపట్టిన పథకాలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నందుకే తమ పార్టీ జెండాలోనూ, ఎజెండాలోనూ వాటిని చేర్చామని ఆయన వివరించారు. పార్టీ పేరేమిటో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారంటూ బొత్స చేసిన వ్యాఖ్యలకు భూమన అభ్యంతరం తెలుపుతూ.. ‘‘మాది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. లక్షలాది మంది శ్రామికులు, కోట్లాది మంది రైతులు, మరెంతో మంది యువజనుల ఆశలను, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, ఆ వర్గాలన్నింటికీ ప్రాతినిధ్యం కల్పించే సమున్నతమైన పార్టీ అని మేం ధైర్యంగా చెప్పుకోగలం. ఏ పార్టీనైనా సంక్షిప్త నామంతో పిలుస్తారు, అలాగే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నాం.. అందులోనే వైఎస్సార్ పేరు కూడా ఇమిడి ఉంది...’’ అని ఆయన పేర్కొన్నారు.

మీది భారత జాతీయ కాంగ్రెస్ అని తెలుసా?

పీసీసీ అధ్యక్షుడైన బొత్సకు.. కాంగ్రెస్ పార్టీ పూర్తి పేరు ‘భారత జాతీయ కాంగ్రెస్’(ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) అనే విషయం తెలుసా? ఆ పేరును ఎపుడైనా ఉచ్చరించారా? 1885 సంవత్సరంలో ఆ పార్టీని ఏర్పాటు చేసిందెవరో బొత్సకు తెలుసా? అని భూమన నిలదీశారు. అసలాయనకు అంత రాజకీయ పరిజ్ఞానం ఎక్కడిదని అన్నారు. వైఎస్ చేపట్టిన ఏ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసేసిందో చెప్పాలని బొత్స అడగడం అర్థరహితమని ఆయన అన్నారు. ‘‘982 వ్యాధులకు చికిత్స చేయించేందుకు వీలుగా వైఎస్ రూపకల్పన చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరు కారుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? శాశ్వత దుర్భిక్షం నుంచి విముక్తి కోసం ఉద్దేశించిన జలయజ్ఞాన్ని నీరుగార్చింది మీరు కాదా? ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకానికి తూట్లు పొడుస్తున్నది మీరు కాదా? ప్రజలకు 104, 108 పథకాలను అందుబాటులో లేకుండా చేస్తున్నది మీరు కాదా? అవి నిజంగా కాంగ్రెస్ పథకాలే అయితే మీరెందుకు అమలు చేయడం లేదు’’ అని ఆయన దుయ్యబట్టారు. కిలో రెండు రూపాయల బియ్యాన్ని 20 కేజీల నుంచి 30 కేజీలకు పెంచుతామని, వ్యవసాయరంగానికిచ్చే ఉచిత విద్యుత్‌ను 7 నుంచి 9 గంటలకు పెంచుతామని వైఎస్ ఇచ్చిన రెండు హామీలనూ నేటికీ ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
- See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=611698&Categoryid=1&subcatid=33#sthash.zlWBBNEp.dpufhttp://www.sakshi.com/main/FullStory.aspx?catid=611698&Categoryid=1&subcatid=33

No comments:

Post a Comment