6/11/2013 4:14:00 AM
- ఎన్నికల నిఘా వేదిక చర్చాగోష్టిలో వక్తలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ సరిగ్గా లేదని రెండేళ్లుగా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేసిందని, ఇప్పుడు ఈ ఎన్నికలు నిర్వహించే సమయంలో కూడా రిజర్వేషన్లు గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎన్నికల నిఘా వేదిక ఆధ్వర్యంలో ‘పంచాయతీ ఎన్నికలు-రిజర్వేషన్ల సాధికారత’ అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మైసూరారెడ్డితో పాటు కమలాకర్ (కాంగ్రెస్), డా. శ్రావణ్ (టీఆర్‌ఎస్), రాజేశ్వరరావు (బీజేపీ), భాస్కర్‌రావు (లోక్‌సత్తా) హాజరయ్యారు. ఎన్నికల నిఘా వేదిక ప్రతినిధులు వీవీరావు, రాంచందర్‌లు మాట్లాడుతూ... స్థానిక సంస్థలకు అధికారమిస్తే అధికార దుర్వినియోగం జరుగుతుందని పంచాయతీరాజ్ మంత్రి అన్నారని, అయితే, ఎంపీలు, ఎమ్మెల్యేలే ఎక్కువగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అన్నారు. మొదట జిల్లా పరిషత్, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాక ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని, కానీ ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా పోతోందని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు రాష్ట్రం యూనిట్‌గా చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. జిల్లాలవారీగా రిజర్వేషన్లు ఉంటేనే పారదర్శకంగా ఉంటుందన్నారు. అనేక దేశాల్లో పన్నులను మూడు విధాలుగా విభజించుకుంటారని, కానీ అలాంటి సంప్రదాయం మన దేశంలో లేదని అన్నారు. రిజర్వేషన్ల జాబితాను కూడా గోప్యంగా ఉంచుతున్నారని విమర్శించారు. |
No comments:
Post a Comment