Tuesday, 11 June 2013

బాబుది చీకటి ఒప్పందం

6/11/2013 2:01:00 AM
రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుంటే అక్రమాలు
ప్రభుత్వం వందిమాగధులకే మేలయ్యే విధంగా వ్యవహరిస్తోంది
బడుగు, బలహీన వర్గాలకూ మహిళలకూ అన్యాయం
టీడీపీ నుంచి వలసలను అడ్డుకోవడానికే బాబు సర్వేలు

సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ప్రభుత్వ వాలకం చూస్తుంటే వందిమాగధులకు, కావాల్సిన వారికి, బంధువులకు మేలు కలిగేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే రిజర్వేషన్ల వ్యవహారాన్ని చాలా గోప్యంగా నడిపిస్తోంది. రిజర్వేషన్లకు పాటిస్తున్న విధానం ఏమిటో ప్రజల ముందు బహిర్గతం చేయాలి’’ అని డిమాండ్ చేశారు.

‘‘స్థానిక సంస్థల రిజర్వేషన్లకు జిల్లాను యూనిట్‌గా తీసుకుంటారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుంటున్నట్లు పత్రికల్లో చదివాను. ఇది సరైన విధానం కాదు. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని గోప్యంగా వ్యవహరించడంవల్ల ప్రభుత్వం ఇష్టానుసారం రిజర్వేషన్లు చేసుకుని అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బడుగు, బలహీన, బీసీ వర్గాలు, మహిళలకు అన్ని ప్రాంతాల్లో ప్రాతినిధ్యం లభించాలన్న ఉద్దేశంతోనే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు పెట్టారు. అయితే, రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకోవడం వల్ల రిజర్వేషన్ల స్ఫూర్తి దెబ్బ తిని, ఆ వర్గాలకు అన్ని చోట్లా ప్రాతినిధ్యం ఉండదు. సాధారణంగా అన్ని రాష్ట్రాల్లో స్థానిక రిజర్వేషన్లను ఎన్నికల కమిషనే చేస్తుంది. ఇక్కడ మాత్రం ప్రభుత్వం చేస్తోంది’’ అని చెప్పారు. ‘‘రిజర్వేషన్ల ప్రకటన వెలువడిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది చాలా దుర్మార్గం. ఎవరూ న్యాయస్థానాలకు పోకుండా నియంత్రించడానికే ఇలా వ్యవహరిస్తున్నట్లుగా ఉంది. నిజాయితీపరుడు, పాలనానుభవం కలిగిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ఇలాంటి చర్యలను నిరోధించాలి. రిజర్వేషన్లు ప్రకటించాక ఏది రిజర్వేషన్, ఏది కాదు, అన్యాయాలు జరిగాయా అని తెలుసుకుని ప్రజలు వాటిపై అభ్యంతరాలు తెలిపే అవకాశమివ్వాలి’’ అని అన్నారు.

బాబుది చీకటి ఒప్పందం

టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్‌తో కుదుర్చుకున్న చీకటి ఒప్పందంలో భాగంగానే బయట ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ లోలోపల సర్కారుతో మాట్లాడుకుంటూ ఉంటారని మైసూరా ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కళంకిత మంత్రులను తొలగించాలని పోరాటం చేస్తామని బాబు ప్రకటించడాన్ని ప్రస్తావించగా.. ఇది ప్రజలను మభ్యపెట్టడానికే ఆయన వ్యాఖ్యానించారు. బాబు చిత్తశుద్ధితో అవిశ్వాసం పెడితే ప్రభుత్వం పడిపోతుందని, ఆయన చేతిలో ఉన్న పనిని వదిలి వేసి ఇలాంటివి చేస్తూ ఉంటారని చెప్పారు. టీడీపీ నిర్వహించిన సర్వేలో ఆ పార్టీకి మెజారిటీ అసెంబ్లీ స్థానాలు వచ్చాయని చెబుతున్న విషయంపై విలేకరులు ప్రశ్నించగా.. ‘అవును.. ఆ సర్వే లెక్కలన్నీ బాబు ఇంట్లో కూర్చుని తయారు చేసినవి. అవి కేవలం వాళ్లు మురిసిపోవడానికే. వారు(టీడీపీ) అదేపనిగా అందరికీ ఎస్సెమ్మెస్‌లు పంపుతున్నారు. టీడీపీ నుంచి ఎవరూ వలసపోకుండా బాబు ఇలాంటివి చేస్తూ ఉంటారు’’ అని మైసూరా చెప్పారు.

No comments:

Post a Comment