6/8/2013 2:13:00 AM
* చంచల్‌గూడ జైలు, నాంపల్లి కోర్టు వద్ద జగన్ అభిమానులపై లాఠీచార్జి
* చంచల్‌గూడ జైలు, సీబీఐ కోర్టు వద్ద అభిమానులకు అడ్డంకులు * విజయమ్మ, భారతి సహా కుటుంబ సభ్యులనూ అడ్డుకున్న పోలీసులు * ఖాకీ జులుంపై అభిమానుల నిరసన సాక్షి, హైదరాబాద్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరైన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు పలు విమర్శలకు తావిస్తోంది. ఆయన్ను చూడ్డానికి వచ్చిన అభిమానులను అడుగడుగునా అడ్డుకుంటూ, లాఠీలు ఝళిపిస్తూ పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారు. చంచల్‌గూడ జైలు వద్ద, నాంపల్లి కోర్టు వద్ద ప్రత్యేకంగా భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి అభిమానులను అడ్డుకున్నారు. ‘‘జగనన్నను కళ్లారా చూసి ఆరు నెలలైంది.. ఒక్కసారి చూడనీయన్నా’’ అంటూ కొందరు అభిమానులు ఎంత మొరపెట్టుకున్నా పోలీసు గుండె కరగలేదు. పైగా చంచల్‌గూడ జైలు వద్ద అభిమానులపై స్వల్ప లాఠీచార్జి చేశారు. నాంపల్లి కోర్టు వద్ద లాఠీలతో నెట్టివేశారు. జగన్ కుటుంబీకులను సైతం ఆయన దరికి రానివ్వకుండా పోలీసులు తమ కర్కశత్వాన్ని చాటుకున్నారని అభిమానులు మండిపడ్డారు. నాంపల్లి కోర్టుకు రెండు వైపుల నుంచి వెళ్లే మార్గాలను బారికేడ్‌లతో మూసివేయడంతో ఆ వైపుగా వెళ్లే వాహనదారులు, కోర్టులో వివిధ కేసుల నిమిత్తం హాజరయ్యే వారు కూడా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. సుమారు ఆరు నెలల తరువాత వైఎస్ జగన్ జైలు బయటకు వస్తున్నారనే విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఉదయం నుంచే జైలు వద్దకు చేరుకున్నారు. అయితే వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యురాలు విజయారెడ్డితోపాటు కొందరు కార్యకర్తలను కూడా అరెస్టు చేశారు. చెదరని చిరునవ్వుతో జగన్.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డిని పోలీసులు వేర్వేరు వాహనాల్లో నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు తరలించారు. జగన్‌మోహన్‌రెడ్డిని ఉదయం 9.55 గంటలకు చంచల్‌గూడ జైలు నుంచి బయటకు తీసుకువచ్చారు. లేత గులాబీ రంగు హాఫ్ హ్యాండ్స్ షర్ట్.. గచ్చకాయ రంగు ప్యాంటు ధరించి ఉన్న ఆయన చెదరని చిరునవ్వుతో కనిపించారు. అక్కడ వేచి ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం ఆయన కోసం సిద్ధంగా ఉన్న వాహనంలో ఎక్కారు. అప్పటికే ఆ బులెట్‌ప్రూఫ్ వాహనాన్ని బాంబ్‌స్క్వాడ్ బృందం తనిఖీలు చేసింది. వెనకాముందూ పోలీసు వాహనాల భద్రతతో ఆయన్ను నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చారు. కాగా డబీర్‌పురా వైపు నుంచి వస్తున్న అభిమానులను పోలీసులు అక్కడే అడ్డుకుని వెనక్కు పంపించివేశారు. జగన్‌మోహన్‌రెడ్డి వాహనం నాంపల్లికి వెళ్లే క్రమంలో చంచల్‌గూడ చౌరస్తా వద్ద పెద్ద సంఖ్యలో వేచి ఉన్న కార్యకర్తలు ఒక్కపెట్టున నినాదాలు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు ముందుకు కదిలారు. దీంతో పోలీసులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జి చేయడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లాఠీచార్జి జరుగుతున్నా కార్యకర్తలు జై జగన్ అనే నినాదాలు ఆపలేదు. దీనిపై వైఎస్‌ఆర్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా సమన్వయకర్త జనార్దన్‌రెడ్డి తదితరులు నిరసన వ్యక్తం చేశారు. |
No comments:
Post a Comment