Monday, 10 June 2013

అధికారం అడ్డుపెట్టుకుని ఇన్నీసుపేట అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో చక్రం తిప్పుదామనుకున్న అధికార పార్టీ నేతల పాచిక పారలేదు

సాక్షి, రాజమండ్రి : అధికారం అడ్డుపెట్టుకుని ఇన్నీసుపేట అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో చక్రం తిప్పుదామనుకున్న అధికార పార్టీ నేతల పాచిక పారలేదు. ఆదివారం జరగాల్సిన రాజ మండ్రి ఇన్నీసుపేట కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. బ్యాంకు పాలకవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీకే చెందిన కొందరు హైకోర్డును ఆశ్రయించడంతో ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే ఇచ్చింది. దీంతో బ్యాంకు ఎన్నికల్లో తన ప్యానల్‌ను గెలిపించుకోవాలన్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు వర్గం ఎత్తులకు చెక్‌పడింది.

పూర్తి స్థాయిలో ఎన్నికలు
వాస్తవానికి ఈ బ్యాంకు ఎన్నికలు ఆరు నెలల క్రితం జరగాల్సి ఉంది. నామినేషన్లు వేసిన 44 మంది ప్యానెల్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం.. గత పాలక మండలి చైర్మన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని, తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని అప్పట్లో హై కోర్టును ఆశ్రయించారు. దీంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిన విషయం తెలిసిందే. గతంలో బ్యాంకు చైర్మన్ వర్గాన్ని వ్యతిరేకించిన ఎమ్మెల్యే.. ఇటీవల ఆ ప్యానెల్‌కు మద్దతివ్వడమే కాకుండా కోర్టులో దాఖలైన పిటిషన్‌ను ఉపసంహరించుకునేలా చేశారు. తద్వారా ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమమైంది.

అప్పటికే దాఖలైన నామినేషన్లను పరిగణనలోకి తీసుకుని ఉపసంహరణల ఘట్టం నుంచి ఎన్నికలు కొనసాగించేలా తన ‘పవర్’ను ఉపయోగించి ఉత్తర్వులు కూడా రప్పించడంతో కాంగ్రెస్ పార్టీలోనే మరో వర్గం ఆగ్రహానికి కారణమైంది. ఆ ఉత్తర్వుల ప్రకారం ఈ నెల రెండున నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేసి, తొమ్మిదిన(ఆదివారం) ఎన్నికలు జరిపేందుకు అధికారులు నిర్ణయించారు. మాజీ ఎపీఐఐసీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం మద్దతు కూడగట్టుకున్న ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం మరోసారి కోర్టును ఆశ్రయించింది. పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని రెండు రోజుల క్రితం కోర్టు సూచించడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. 

No comments:

Post a Comment