6/8/2013 2:06:00 AM
* దాల్మియా చార్జిషీట్‌కు సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు
* కోర్టు ముందుకు జగన్‌తోపాటు ఆడిటర్ విజయసాయిరెడ్డి * హాజరైన మాజీ హోంమంత్రి సబిత సహా ఇతర నిందితులు * అనారోగ్యంతో అంబులెన్స్‌లో వచ్చిన ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మి * నిందితుల్లో దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్, ఇతర ఉద్యోగులు * తదుపరి విచారణ 21కి వాయిదా సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆడిటర్ వి. విజయసాయిరెడ్డిలను పోలీసులు శుక్రవారం నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపర్చారు. జగన్ కంపెనీల్లో దాల్మియా, భారతి సిమెంట్స్ కంపెనీ పెట్టుబడులపై సీబీఐ సమర్పించిన ఐదో చార్జిషీట్(సీసీ నెంబర్ 12/2013)కు సంబంధించి వీరిని నేరుగా హాజరుపరచాలని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఆదేశించడంతో పోలీసులు ఆ మేరకు వీరిని తీసుకొచ్చారు. న్యాయమూర్తి వీరి హాజరును నమోదు చేసుకున్నారు. చివరిసారిగా జగన్ గత డిసెంబర్ 5న నేరుగా కోర్టుకు హాజరయ్యారు. ఆరు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడే ఆయన జైలు బయటి ప్రపంచాన్ని చూశారు. హాజరైన సబిత ఇదే కేసులో నిందితులుగా ఉన్న మాజీ హోంమంత్రి సబిత, గనుల శాఖ మాజీ డెరైక్టర్ వీడీ రాజగోపాల్, ఈశ్వర్ సిమెంట్స్ మాజీ ఎండీ సజ్జల దివాకర్‌రెడ్డి, దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియా, దాల్మియా సిమెంట్స్ ఉన్నతాధికారులు సంజయ్ ఎస్. మిత్రా, నీల్‌కమల్ బేరి, జయ్ దీప్ బసులు కోర్టుకు ప్రత్యక్షంగా హాజరయ్యారు. కోర్టు సూచించిన మేరకు రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు, వ్యక్తిగత బాండ్‌లను సమర్పించారు. ఇదే కేసులో నిందితురాలుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ వై.శ్రీలక్ష్మి అనారోగ్యంతో కోర్టు హాల్‌లోకి రాలేకపోయారు. అంబులెన్స్‌లో ఆమె వచ్చారని, అనారోగ్యంతో ఉన్న కారణంగా మూడో అంతస్తులో ఉన్న కోర్టుకు రాలేకపోయారని ఆమె తరఫు న్యాయవాది నివేదించారు. తన సిబ్బందిని కిందకు పంపిన న్యాయమూర్తి.. ఆమె హాజరును నిర్ధారించుకున్నారు. కోర్టు నిర్దేశించిన మేరకు రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు, వ్యక్తిగత బాండ్‌ను శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. రఘురామ్ సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ తరఫున కూడా ప్రతినిధులు హాజరై పూచీకత్తు బాండ్లు సమర్పించారు. విచారణ 21కి వాయిదా పూచీకత్తు బాండ్లను పరిశీలిస్తామని, తదుపరి విచారణ రోజున పూచీకత్తు ఇచ్చిన వారు కోర్టు ముందు హాజరు కావాలని న్యాయమూర్తి సూచిస్తూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు. ఈశ్వర్ సిమెంట్స్ దాల్మియా సిమెంట్స్‌లో విలీనమైందని, ఈ నేపథ్యంలో ఈశ్వర్ సిమెంట్స్‌ను నిందితుల జాబితా నుంచి తొలగించాలని హైకోర్టు న్యాయవాది శ్రీరాం ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఈ మేరకు మెమో దాఖలు చేశారు. దీనిపై విచారణను న్యాయమూర్తి ఈ నెల 21కి వాయిదా వేశారు. |
No comments:
Post a Comment