సాక్షి, హైదరాబాద్: వైఎస్ కుటుంబంపై తనకున్న అక్కసును, అంతులేని విద్వేషాన్ని ఎల్లో మీడియా మరోసారి బయట పెట్టుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం కోర్టుకు హాజరైన సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ భారతి పోలీసులపై చేయిచేసుకున్నారంటూ యథేచ్ఛగా వికృత ప్రచారానికి తెగబడింది. అక్కడ చోటుచేసుకున్న పరిణామాలను షరామామూలుగా తాను పచ్చ కామెర్ల కళ్లతో చూడటమే గాక, లోకమంతటికీ అలాగే చూపించేందుకు విఫలయత్నం చేసింది. ఆ క్రమంలో కనీసస్థాయి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా దిగజారి ప్రవర్తించింది. శుక్రవారం ఉదయం జగన్‌ను కలిసేందుకు వచ్చిన ఆయన మాతృమూర్తి వైఎస్ విజయమ్మను, వైఎస్ భారతిని, కుటుంబీకులను పోలీసులు ఒక పట్టాన కోర్టు ఆవరణలోకి రానివ్వలేదు. దానికి తోడు తమ అభిమాన నేతను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం, లోనికి వెళ్లేందుకు ఒకే ఒక ఇరుకైన గేటు అందుబాటులో ఉండటంతో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది.
దాంతో వైఎస్ కుటుంబమంతా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ క్రమంలో వయో వృద్ధుడైన తన తండ్రి ఈసీ గంగిరెడ్డిని పక్కకు తోసేస్తున్న ఒక పోలీసును వీపుపై తట్టి వైఎస్ భారతి వారించారు. ఆ తర్వాత తనవైపు తిరిగిన పోలీసులతో అదే విషయాన్ని ఆమె వివరంగా చెబుతుండటం కూడా స్పష్టంగా కన్పించింది. కానీ వైఎస్ వ్యతిరేకతను నిలువెల్లా నింపుకున్న ఎల్లో చానళ్లకు మాత్రం ఇదేమీ పట్టలేదు. పోలీసును వైఎస్ భారతి చేత్తో తడుతున్న దృశ్యాన్ని మాత్రమే దొరకబుచ్చుకుని, దానికి చిలువలు పలువలు జోడిస్తూ చెలరేగిపోయాయి. జరిగిందేమిటో తెలుసుకునేందుకు కనీసపాటి ప్రయత్నం కూడా చేయకపోగా, ‘పోలీసులపై చేయిచేసుకున్న భారతి’ అంటూ అడ్డంగా వక్రీకరించి తమ వంకరబుద్ధిని బయట పెట్టుకున్నాయి. అదే విజువల్‌ను పదేపదే ప్రసారం చేసి పైశాచికానందం పొందాయి.
No comments:
Post a Comment