Saturday, 8 June 2013

తల్లడిల్లిన తల్లి హృదయం

- జగన్‌ను హత్తుకుని కన్నీరు పెట్టుకున్న విజయమ్మ
- నాన్న ఉంటే ఈ కష్టాలు అనుభవించేవాడివా అంటూ ఆవేదన
- తల్లిని అక్కున చేర్చుకుని మనోధైర్యాన్ని పంచిన జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన సమయంలో అక్కడే ఉన్న తల్లి విజయమ్మ కుమారుణ్ణి చూసి తల్లడిల్లారు. దుఃఖం ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. ఆప్యాయంగా బిడ్డను ఆలింగనం చేసుకుని దాదాపు 10 నిమిషాలు మౌనంగా నిలబడిపోయారు. నాన్న ఉంటే ఇలా కష్టాలు అనుభవించేవాడివా అంటూ విలపించారు. కన్నీటి పర్యంతమవుతున్న తల్లిని చూసి జగన్ భావోద్వేగానికి లోనయ్యారు. 

బరువెక్కిన గుండెతో తల్లిని అక్కున చేర్చుకొని ఓదార్చారు. విజయమ్మ కన్నీరు తుడుస్తూ.. గుండెనిబ్బరంగా ఉండాలంటూ మనోధైర్యాన్ని పంచారు. కోర్టు విచారణ అనంతరం న్యాయమూర్తి అనుమతితో దాదాపు 40 నిమిషాలపాటు విజయమ్మ, భార్య భారతి, మామ గంగిరెడ్డి ఇతర కుటుంబ సభ్యులతో జగన్ మాట్లాడారు. ఉదయం 10.20 నిమిషాలకు కోర్టుకు చేరుకున్న జగన్.. 11.50 నిమిషాలకు తిరిగి జైలుకు వెళ్లిపోయారు. జైలుకు వెళ్తున్న సమయంలో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో కనిపించారు. చెరగని చిరునవ్వుతో ముందుకు కదిలారు. తనను కలిసేందుకు వచ్చిన న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, ప్రజలతో కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. ఇక్కడే ఉన్న దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్‌ను జగన్ పలకరించారు. జగన్ పక్కనే ఉన్న విజయమ్మ కాళ్లకు పునీత్ దాల్మియా నమస్కరించారు.

జనసంద్రమైన కోర్టు
జగన్‌ను కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో కోర్టు ప్రాంగణం జనసంద్రమైంది. సీబీఐ ప్రత్యేక కోర్టు హాల్ న్యాయవాదులు, ఇతర కేసులకు చెందిన కక్షిదారులతో కిక్కిరిసిపోయింది. కోర్టు ప్రాంగణమైతే ఉదయం 10 గంటలకే న్యాయవాదులు, ఇతర కక్షిదారులతో కిక్కిరిసిపోయింది. దీంతో జగన్, సాయిరెడ్డి, సబిత సహా ఇతర నిందితులెవరూ న్యాయమూర్తి ముందుకు వెళ్లలేకపోయారు. దీన్ని గమనించిన న్యాయమూర్తి.. ఈ కేసుతో సంబంధం లేని వారంతా బయటకు వెళ్లిపోవాలని సూచిస్తూ విచారణను 10 నిమిషాలు వాయిదా వేశారు. ఈ మేరకు కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించాలని స్థానిక ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌కు ఆదేశాలు జారీచేశారు. 

నిందితులు, న్యాయవాదులు మినహా మిగిలిన వారంతా బయటకు వెళ్లిపోవాలని కోర్టు ఆఫీసర్ సత్యనారాయణ పదే పదే విజ్ఞప్తి చేశారు. దీంతో విజయమ్మ, భారతితోపాటు ఇతర కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి బయటకు వెళ్లిపోయారు. కాగా జగన్‌తో కరచాలనం చేసేందుకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పోటీపడ్డారు. తనకు అందుబాటులో ఉన్న వారందరినీ జగన్ ఆప్యాయంగా పలకరించారు. కోర్టు నుంచి జగన్‌ను జైలుకు తరలిస్తున్న సమయంలో జై జగన్ నినాదాలతో కోర్టు ప్రాంగణం దద్దరిల్లింది. ఉదయం 9 గంటల నుంచే పోలీసులు కోర్టు వద్ద భారీగా మోహరించారు. ప్రజలెవరూ జగన్‌ను కలవకుండా అన్ని ప్రయత్నాలూ చేశారు. అయినా వారి వ్యూహం ఫలించలేదు.

న్యాయవాదుల ఘర్షణ
జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్న నేపథ్యంలో కోర్టు ఆవరణలోకి వస్తున్న న్యాయవాదులను గుర్తింపు కార్డు అడిగారన్న కారణంగా నాంపల్లి క్రిమినల్ కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డితో ఓ న్యాయవాది అనుచితంగా ప్రవర్తించారు. దీంతో న్యాయవాదులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సీబీఐ కోర్టు ప్రాంగణానికి చేరుకొని సదరు న్యాయవాదితో ఘర్షణకు దిగారు. కోర్టు కార్యాలయంలో ఆయనపై దాడికి దిగారు. - See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=614143&Categoryid=1&subcatid=33#sthash.Y6mU72jM.dpuf

No comments:

Post a Comment