Monday, 10 June 2013

స్పెషలాఫీసర్ల పాలన వల్ల అధికారపక్ష కార్యకర్తలు జేబులు నింపుకొన్నారు

స్థానిక పదవులు రిజర్వయిన వర్గాలకు ఇంతకాలం ఆ అధికారాన్ని దూరం చేశారు
స్పెషలాఫీసర్ల పాలన వల్ల అధికారపక్ష కార్యకర్తలు జేబులు నింపుకొన్నారు
కోర్టు ఆదేశించిందని, కేంద్రం నుంచి నిధులు రావట్లేదనే ఇప్పుడు ఎన్నికలు
ఈ ఎన్నికలను వైఎస్సార్ సీపీ శ్రేణులు సీరియస్‌గా తీసుకొని పనిచేయాలి
కాంగ్రెస్-టీడీపీ మళ్లీ కుమ్మక్కవుయి... కాబట్టి మరింత గట్టిగా పోరాడాలి

సాక్షి, హైదరాబాద్: రెండేళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుపకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ బలహీనవర్గాలకు, మహిళలకు అన్యాయం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ విమర్శించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం విజయమ్మ అధ్యక్షతన ఆమె క్యాంపు కార్యాలయంలో తెలంగాణ, రాయలసీమ జిల్లాల సమన్వయకర్తలు, పార్లమెంటు పరిశీలకులు, ముఖ్య నేతల సమావేశం జరిగింది. రాష్ట్రంలో 22 జిల్లా పరిషత్‌లు, 10,942 జెడ్పీటీసీలు, 21,843 గ్రామ పంచాయతీలు, 16,168 ఎంపీటీసీ, 182 మున్సిపాలిటీ, 19 మున్సిపల్ కార్పొరేషన్ పదవులు ఉన్నాయని, వాటన్నింటికీ సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరుపలేకపోయిందని ఆమె పేర్కొన్నారు. 

బడుగు బలహీనవర్గాలు, మహిళలకు వీటిలో చాలా పదవులు రిజర్వయి ఉన్నాయని, ఎన్నికలు జరగనందువల్ల ఆ వర్గాల వారందరినీ స్థానిక అధికారానికి దూరం చేసినట్లయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్పెషలాఫీసర్ల పాలన వల్ల పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించకుండా నామినేషన్ పద్ధతిపైనే నిర్మాణపు పనులు కేటాయించి అధికారపక్షానికి చెందిన కార్యకర్తల జేబులు నింపుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషలాఫీసరుకు బదులు ప్రజల నుంచి ఎన్నుకున్న వారే ప్రతినిధిగా ఉంటే బాధ్యతాయుతంగా ప్రజా సమస్యలు తీర్చడానికి అవకాశం ఉంటుందని ఆమె అన్నారు.

నిధుల కోసమే ఇప్పుడు ఎన్నికలు

ఇపుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్ధి లేదని, కోర్టుల ఆదేశాలు, కేంద్రం నుంచి రావాల్సిన రూ.4 వేల కోట్ల నిధులు ఆగిపోవడం వంటి కారణాల వల్లే ఎన్నికలు జరపాలని భావిస్తోందని విజయమ్మ అన్నారు. ఎన్నికలు జరగనందువల్ల స్థానిక సంస్థలకు బదిలీ చేయాల్సిన 29 అధికారాలను కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నపుడు కూడా స్థానిక సంస్థలకు అధికారాలు ఇవ్వకుండా నీరుగార్చే యత్నం చేశారని ఆమె గుర్తు చేశారు. ఇపుడు జరుగుతున్న స్థానిక ఎన్నికలను పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆషామాషీగా వ్యవహరించొద్దని విజయమ్మ ఉద్బోధించారు. అసెంబ్లీ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు పట్టుదలతో అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కూడా ఆమె సూచించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ రెండూ కలిసి అవగాహనతో పనిచేసే అవకాశం ఉన్నందున వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు గట్టిగా పోరాడాల్సి ఉంటుందన్నారు. పల్లెల్లో మంచినీటికి జనం కటకటలాడుతున్నారని, మరోవైపు కరెంటులేక చీకట్లో కాలం వెళ్లబుచ్చుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి వైఫల్యాలను ప్రచారం చేయాలని కూడా ఆమె అన్నారు.

కాంగ్రెస్, టీడీపీలను మట్టి కరిపిస్తాం: భూమన

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలను వైఎస్సార్ కాంగ్రెస్ మట్టి కరిపిస్తుందని పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. సమన్వయకర్తల సమావేశం అనంతరం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, ఇతర నేతలు కె.కె. మహేందర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, రాజ్‌సింగ్ ఠాకూర్, పుట్టా మధు, కౌశిక్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార, ప్రతిపక్షాలు రెండూ ఏదో ఒక విధంగా ఒక్కటవుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని అన్నారు. వారి కుట్రలను తాము వమ్ము చేస్తామన్నారు. సాధారణ ఎన్నికలకు ముందుగా జరుగుతున్న ఈ స్థానిక ఎన్నికలను తాము ఒక ‘డ్రెస్ రిహార్సల్’గా పరిగణించి సర్వ సన్నద్ధమయ్యామని భూమన వివరించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పార్టీ రహితంగా నిర్వహించాలని కూడా కాంగ్రెస్, టీడీపీలు సమాలోచనలు చేస్తున్నాయన్నారు. పార్టీ ప్రాతిపదికన కనుక ఎన్నికలు జరిగితే వారి అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతవుతాయని భయపడుతున్నారని ఆయన అన్నారు. స్థానిక ఎన్నికల సన్నద్ధతకు 14, 16 తేదీల్లో తిరుపతి, విజయనగరంలలో విజయమ్మ అధ్యక్షతన సమావేశాలు జరుగుతాయని, ఆ తరువాత ఆమె తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తారని ఆయన పేర్కొన్నారు.
- See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=615419&Categoryid=1&subcatid=33#sthash.KwkdVLB8.dpuf

No comments:

Post a Comment