Monday, 10 June 2013

చంద్రబాబు నీచ రాజకీయం..

ఉప ఎన్నికలకు భయపడే 15 మందిపై వేటుకు జాప్యం
ప్రజల తీర్పు వినడానికి కూడా వీరికి ధైర్యం లేదు
భయమే లేకపోతే.. విప్ ఉల్లంఘించిన మార్చి నెలలోనే వేటేయలేదే?
త్వరలో సాధారణ ఎన్నికలు వస్తున్నాయి.. 
ఈ పిరికిపందలు అప్పుడెలా తప్పించుకుంటారు?
ప్రభుత్వం పడిపోదంటే అవిశ్వాసం..పడిపోతుందంటే విశ్వాసం.. ఇదీ బాబు నైజం
నాడు పీఆర్పీ విలీనం కాకముందు అవిశ్వాసం పెట్టకుండా విలీనమయ్యాక పెట్టారు
ఇప్పుడు కూడా కాంగ్రెస్ డెరైక్షన్‌లో చంద్రబాబుఅదే ఎత్తుగడ వేస్తున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ ఆదివారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 174, కిలోమీటర్లు: 2,305.1

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ప్రజా కోర్టులో ప్రజలు చెప్పే తీర్పు వినటానికి కూడా ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులకు ధైర్యం లేదు. ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రజల పక్షాన నిలబడిన 15 మంది ఎమ్మెల్యేలపై ఇంతకాలం వేటు వేయకుండా జాప్యం చేశారు. ఇప్పుడు వేటేస్తే ఈ ఏడాదిలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని తెలిసి డిస్‌క్వాలిఫై చేయించారు. 

ఉప ఎన్నికలకు భయపడే వీళ్లను నాయకులు అనాలా? పిరికిపందలు అనాలా? ఇంకొన్ని నెలల్లో(2014లో) సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ పిరికిపందలు అప్పుడెలా తప్పించుకుంటారు?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ‘‘పదవీ త్యాగాలకు సిద్ధపడి, జగనన్న మాట మేరకు 9 మంది కాంగ్రెస్, ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి మద్దతుగా ఓటేశారు. కాంగ్రెస్, టీడీపీలు భయపడకపోతే మార్చి నెలలో విప్ ధిక్కరించినప్పుడే ఈ ఎమ్మెల్యేల మీద వేటు వేయలేదేం? వీళ్లకు భయమే లేకపోతే రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీల గుర్తులతోనే పోటీ చేస్తామని ఎందుకు చెప్పడం లేదు?’’ అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చే పట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో సాగింది. మండపేటలో భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు విప్ జారీచేసి మరీ ప్రభుత్వాన్ని కాపాడారు

ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలూ కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే, మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడేమో, ప్రజల పక్షాన నిలబడకుండా నిస్సిగ్గుగా కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన నిలబడ్డారు. వాళ్ల ఎమ్మెల్యేలను అవిశ్వాసానికి మద్దతు పలకొద్దని విప్ జారీ చేసి మరీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడారు. నిజానికి అవిశ్వాసం పెట్టడానికి కారణం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు పాలన, కరెంటు బాదుడు, చార్జీల మోత. వేటు పడుతుందని తెలిసి, పదవులు కోల్పోతారని తెలిసి, వారి పార్టీలు వాళ్లను వెలేస్తాయని తెలిసి కూడా 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరించి అవిశ్వాసానికి మద్దతు పలికారు. ప్రజల పక్షాన నిలబడ్డారు. పదవులు త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. వాళ్లకు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం అవిశ్వాసానికి ఓటేశారు. అప్పుడే వారిపై అనర్హత వేటు వేసి ఉంటే.. వెంటనే ఉప ఎన్నికలు వచ్చేవి. అప్పుడు పోయిన ఏడాది ఉప ఎన్నికల మాదిరిగా కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు కూడా రావని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లనూ కైవసం చేసుకుంటుందని తెలిసి.. ఈ రెండు పార్టీల నేతలకూ స్పీకర్ వంత పాడి కావాలనే జాప్యం చేశారు. పార్లమెంటులో అయితే విప్ ధిక్కరిస్తే వెంటనే డిస్ క్వాలిఫై చేస్తారు. కానీ మన రాష్ట్రంలో ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులు.. విప్ ధిక్కరించినవారి మీద వేటు వేయండీ అని స్పీకర్‌ను కోరనే లేదంటే ఉప ఎన్నికలంటే ఎంత భయమో అర్థమవుతోంది. 
- See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=615379&Categoryid=1&subcatid=33#sthash.DDZajvvr.dpuf

No comments:

Post a Comment