Monday, 10 June 2013

ప్రజాకర్షణ గల నాయకుడు చివర్లో మాట్లాడాలని మోడీకి రాజ్‌నాథ్ సూచించారు

6/10/2013 12:41:00 AM
ప్రచార కమిటీ సారథిగా తొలి బహిరంగ సభలో ప్రసంగం
ప్రజల మనస్సుల్లో స్థానం కోసం కృషిచేయాలని శ్రేణులకు పిలుపు

పనాజి:
భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమితుడైన వెంటనే.. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచార భేరి మోగించారు. గోవాలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత జరిగిన బహిరంగ సభలో యూపీఏ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశప్రజలను కాంగ్రెస్ తేలికగా తీసుకుంటోందని, ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చినా, విధానాలు పక్షవాతంతో పడకేసినా, అంతర్గత భద్రత, ఆర్థిక పరిస్థితి, విదేశాంగ విధానంలో విఫలమైనా.. నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రహిత భారత నిర్మాణం కోసం కృషిచేయాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తదితరుల సమక్షంలో మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్‌ను అధికారం నుంచి కూలదోసి.. మాజీ ప్రధానమంత్రి అటల్‌బిహారి వాజ్‌పేయి వదిలిపెట్టిన కృషిని పునరుద్ధరించటానికి బీజేపీ వ్యూహం రచిస్తుందని చెప్పారు. ‘‘ప్రజలకు సేవ చేయటానికి రాజకీయ జీవితం ఒక మార్గం. మనం వ్యవస్థను మార్చటానికి గెలిచి, అధికారంలోకి రావాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించటానికి కృషి చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ ఎజెండా ప్రభుత్వాన్ని మార్చటం కాదు.. దేశాన్ని అభివృద్ధి చేయటమని పేర్కొన్నారు.

అది మునుగుతున్న నావ...

‘‘యూపీఏ మునుగుతున్న నావ. ప్రజలు యూపీఏపై విశ్వాసం కోల్పోయారు’’ అని మోడీ ధ్వజమెత్తారు. ‘‘నక్సలిజంపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం చెప్తోంది.. కానీ వామపక్ష సిద్ధాంత సానుభూతిపరులుగా చెప్తున్న వారిని ప్రణాళికా సంఘంలో, సోనియాగాంధీ నేతృత్వంలోని జాతీయ సలహా మండలిలో నియమించారు’’ అని తప్పుపట్టారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని ప్రణాళికాసంఘం పైన సోనియా నేతృత్వంలోని జాతీయ సలహా మండలిని ఏర్పాటు చేశారని.. జాతీయ సలహా మండలిని ఏర్పాటు చేసేట్లయితే ప్రధానమంత్రి ఎందుకని ఎద్దేవా చేశారు.

‘సమాఖ్య’ను కాంగ్రెస్ అంగీకరించదు...

ప్రజాస్వామ్య సంస్థలపై కాంగ్రెస్‌కు నమ్మకం లేదని, రాజ్యాంగంలోని సమాఖ్య నిర్మాణాన్ని అంగీకరించేందుకు ఆ పార్టీ సిద్ధంగా లేదని మోడీ విమర్శించారు. ‘‘కాంగ్రెస్ ఒకప్పుడు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకూ అధికారంలో ఉంది. కానీ రాష్ట్రాల్లో అధికారం కోల్పోవటం మొదలవగానే.. 356 అధికరణను దుర్వినియోగం చేసి ఇతర పార్టీలు ప్రభుత్వంలో పూర్తికాలం కొనసాగకుండా అడ్డుకుంది. రాజ్‌భవన్లను కాంగ్రెస్ భవన్లుగా మార్చింది’’ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐని దుర్వినియోగం చేస్తోందని మోడీ దుయ్యబట్టారు. ‘‘తనపై సీబీఐ కేసు లేని ప్రతిపక్ష నేత ఒక్కరు కూడా లేరు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

యువశక్తిని దారిలో పెట్టాలి...

‘యువత భవిష్యత్తుపై యూపీఏ శ్రద్ధ పెట్టటం లేదు. యువశక్తిని సరైన దారిలో పెట్టకపోతే అశాంతి చోటుచేసుకుంటుంది. ప్రభుత్వం తమ మాట వినకపోతే వారు అనేక సమస్యలపై జంతర్ మంతర్‌కు ప్రదర్శనగా వెళతారు’ అని మోడీ వ్యాఖ్యానించారు. నేటి మహిళలకు జాతి నిర్మాణంలో పాలుపంచుకోవాలన్న ఆకాంక్ష లు ఉన్నాయని, కానీ వారి గురించి ఆలోచించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి సమయం లేదని విమర్శించారు.

న్యాయమంత్రికి చట్టం తెలియదు...

‘‘మనకొక న్యాయశాఖ మంత్రి ఉన్నారు.. తన జీవితం మొత్తం నల్లకోటు వేసుకుని సుప్రీంకోర్టు చుట్టూ తిరిగారు. ఐపీఎల్‌లో ఒక కుంభకోణం బహిర్గతమైతే.. దానిపై ఒక చట్టం చేస్తానని ఆయన తక్షణం చెప్పేశారు. అలాంటి చట్టం చేయటానికి కేంద్రానికి అధికారం లేదని ఆయనకు తెలియదు. అది రాష్ట్ర పరిధిలోని అంశమన్న విషయం ఆయనకు తెలియదు. ముందు చట్టం చేస్తామన్నారు.. ఆ తర్వాత తాను చట్టం చేయలేనన్నారు. న్యాయ వ్యవస్థ గురించి తెలియని ఈ న్యాయమంత్రి ఏమిటి?’’ అంటూ కపిల్‌సిబల్‌పై మోడీ పరోక్షంగా విమర్శలు ఎక్కు పెట్టారు.

రాజ్‌నాథ్‌ది విశాల హృదయం...

మోడీ తన ప్రసంగంలో పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనది విశాల హృదయమని, బయటివారు దానిని అర్థంచేసుకోలేరని పేర్కొన్నారు. అంతకుముందు సభలో తాను మాట్లాడిన తర్వాత మాట్లాడాలని.. ప్రజాకర్షణ గల నాయకుడు చివర్లో మాట్లాడాలని మోడీకి రాజ్‌నాథ్ సూచించారు. దీనిని ప్రస్తావిస్తూ రాజ్‌నాథ్ తనకు కొత్త బాధ్యత అప్పగించటమే కాకుండా.. పార్టీ శ్రేణులు, దేశ ప్రజల ఎదుట ఎంతో గౌరవం ఇచ్చారని మోడీ పేర్కొన్నారు. ఇది ఆయన విశాల హృదయానికి నిదర్శనమంటూ.. అందుకు తాను ఆయనకు ఎంతో రుణపడి ఉంటానన్నారు. పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా మోడీని నియమించాలన్న తన నిర్ణయం పార్టీ కోసం కాదని దేశం కోసమని రాజ్‌నాథ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకోవటంలో తాను ఎలాంటి సంశయానికీ లోనుకాలేదన్నారు. బొగ్గు గనుల కుంభకోణానికి సంబంధించి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోడీని ప్రచార కమిటీ సారథిగా నియమించాలన్న రాజ్‌నాథ్ నిర్ణయం రాజకీయాలకు కొత్త కోణాన్నిచ్చిందని అరుణ్‌జైట్లీ అభివర్ణించారు. 

No comments:

Post a Comment