6/13/2013 1:55:00 AM
* ఒక వ్యక్తిపై ఇన్ని కుట్రలా?
* జగన్ ‘ఓదార్పు’నకు వెళ్లడమే తప్పయ్యిందా? * అల్లుడి తప్పులు సోనియాకు కనపడవా? * చంద్రబాబు బినామీ ఆస్తుల సంగతేంటి? * ఇవి సీబీఐకి కన్పించలేదా? * ‘సాక్షి చైతన్య పథం’లో సూటిగా ప్రశ్నించిన వక్తలు ధర్మవరం రూరల్, న్యూస్‌లైన్ : ‘భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులను కాంగ్రెస్ పాలకులు కాలరాస్తున్నారు. జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో ముమ్మాటికీ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. మహానేత వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర చేపట్టడమే ఆయన చేసిన తప్పా? ఓదార్పు యాత్రకు లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడంతో పాలకులకు కన్నుకుట్టింది. అందుకే ఇబ్బందులు పెట్టారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేలా చేశారు. అప్పటికీ విడిచిపెట్టకుండా జైలుపాలు చేశారు. ఇదెక్కడి న్యాయం..’ అని పలువురు వక్తలు ప్రశ్నించారు. బుధవారం ధర్మవరం పట్టణంలోని ప్రణవ్ ఫంక్షన్ హాలులో ‘సాక్షి చైతన్య పథం’ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా స్వప్న వ్యవహరించారు. ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. వైఎస్ జగన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం చేతుల్లో సీబీఐ కీలుబొమ్మగా మారిందన్నారు. సీబీఐ పంజరంలో చిలుక అని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలకులు సీబీఐని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న కొద్ది గంటల్లోనే తమిళనాడుకు చెందిన డీఎంకే నేత స్టాలిన్ ఇంటిపై సీబీఐ పెద్దఎత్తున దాడులు చేయడం, అదే యూపీఏకు మద్దతు కొనసాగిస్తున్న ములాయంసింగ్ యాదవ్, మాయావతి విషయంలో ఏమీ ఎరుగనట్లు వ్యవహరించడం ఇందుకు నిదర్శనమన్నారు. దేశంలోనే అతిపెద్ద స్కామ్ అయిన 2జీ స్పెక్ట్రం కేసులో నిందితులుగా ఉన్న రాజా, కనిమొళిలకు బెయిల్ మంజూరయ్యేలా మార్గం సుగమం చేసిన కేంద్రం... అదే జగన్ విషయంలో మాత్రం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జగన్ విషయంలో కాంగ్రెస్, టీడీపీ ఒక్కటి కావడం సిగ్గుచేటన్నారు. ‘కేవలం రెండెకరాల ఆసామి అయిన చంద్రబాబుకు ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చా యి? బాబు అక్రమ ఆస్తులపై విచారణ చేపట్టాలని వైఎస్ విజయమ్మ హైకోర్టుకు లేఖ రాస్తే.. విచారణ చేయడానికి తగినంత సిబ్బంది లేరంటూ సీబీఐ తప్పించుకోవడం వాస్తవం కాదా? అదే జగన్ విషయంలో మాత్రం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇది పక్షపాత వైఖరికి నిదర్శనమ’ని నిప్పులు చెరిగారు. రాబర్ట్ వధేరాపై పలు ఆరోపణలు వచ్చాయని, అవ న్నీ సోనియాకు కనపడవా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 26 జీఓలకు సంబంధించి మంత్రులంతా మచ్చలేని వారంటూ సీఎం కిరణ్ చెప్పడం శోచనీయమన్నారు. జీఓలతో సంబంధమున్న మంత్రులంతా నిర్దోషులైతే.. ఏ రోజూ సచివాలయం మెట్లు తొక్కని జగన్ దోషి ఎలా అవుతారని ప్రశ్నించారు. సాక్షి చానల్, పత్రిక లేకపోతే ఈనాడు, దాని తోకపత్రిక ఏం చెప్పినా, ఏం చేసినా చెల్లుబాటు అయ్యేదన్నారు. కాంగ్రెస్, టీడీపీ, ఎల్లో మీడియా ఒక్కటై జగన్‌ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయని, వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీలు తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు అతావుల్లా, శంకర్‌రెడ్డి, గృహిణి అనసూయమ్మ, బీటెక్ విద్యార్థి మధు, ఎంఆర్‌పీఎస్ నాయకుడు పవన్‌కుమార్, చేనేత సంఘం నేత గిర్రాజు రవి మాట్లాడారు. |
No comments:
Post a Comment