6/11/2013 2:01:00 AM
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా పీలేరు శాసనసభ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పాక్షికంగా, సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పి.రమాకాంతరెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. పార్టీ శాసనసభాపక్ష ఉప నేత ధర్మాన కృష్ణదాస్, విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, చిత్తూరు జిల్లా పార్టీ నేత పి.మిథున్‌రెడ్డిలతో కూడిన బృందం సోమవారం రమాకాంతరెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించింది. ఇటీవలి సహకార సంస్థల ఎన్నికల్లో కిరణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అందులో పేర్కొంది. ఆ ఎన్నికల్లో ఇతరులెవరినీ నామినేషన్లు వేయకుండా, ఓటర్ల జాబితాను ప్రకటించకుండా, నామినేషన్లు వేయకుండా నిరోధించిన తీరును కమిషనర్‌కు నేతలు వివరించారు.
ఇందుకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగులను అందజేశారు. అవకతవకలు, అధికార దుర్వినియోగానికి సంబంధించి కచ్చితమైన వివరాలను తన దృష్టికి తెస్తే తప్పక చర్యలు తీసుకుంటానని, పీలేరులో ఎన్నికల నిర్వహణ సజావుగా నిర్వహిస్తామని రమాకాంత్‌రెడ్డి వారికి హామీ ఇచ్చారు. అనంతరం ధర్మాన, బాలినేని, చింతల మీడియాతో మాట్లాడుతూ..సహకార ఎన్నికల్లో పీలేరులో సీఎం కిరణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. ‘‘స్థానిక ఎన్నికల్లో అది పునరావృతం కాకుండా చూడాలని, అక్కడ సీఎంకు అనుకూలంగా పనిచేసే అధికారులను బదిలీ చేయాలని కమిషనర్‌ను కోరాం. ఈ అధికారుల ద్వారానే సహకార ఎన్నికల్లో కిరణ్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా వారి సాయంతో తనకు అనుకూలంగా ఏకగ్రీవమయ్యేలా చూసుకోవాలని ఆయన చూస్తున్నారు. నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే తన సొంత నియోజకవర్గంలోనే కాంగ్రెస్ ఓటమి ఖాయమమనే భయంతోనే అడ్డదార్లు తొక్కాలని భావిస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. |
No comments:
Post a Comment