Wednesday, 5 June 2013

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ మంగళవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 169, కిలోమీటర్లు: 2,235.8

టీడీపీని కబ్జా చేసి.. నందమూరి కుటుంబాన్ని తొక్కేసి.. ఒక్క లోకేశ్‌నే పైకి తేవాలనుకోవడం లోక కల్యాణం కాదు.. 
లోకాన్ని దోచుకుని మీరు సంపాదించుకున్న ఆస్తులేమో లోకేశ్‌కు ఇస్తారు.. జెండా పట్టుకున్న కార్యకర్తలేమో ఆస్తులు అమ్ముకోవాలా?
జెండా పట్టుకున్న కార్యకర్తలేమో ఆస్తులు అమ్ముకోవాలా?
చంద్రబాబూ.. మీకు పదవీ వ్యామోహం లేదంటే మీ పార్టీ వారే నమ్మరు
ఇప్పుడు వెలుగులు నింపుతానంటున్నారు.. మరి అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లు ఏంచేశారు?
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ మంగళవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 169, కిలోమీటర్లు: 2,235.8


ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎన్నో సినిమా డైలాగులు చెప్తున్నారు. తాను లోక కల్యాణం కోసం పాటు పడుతున్నానని చెప్తున్నారు. తనకు స్వార్థం లేదని, ప్రజాసేవే ముఖ్యమని, రాష్ట్రంలో వెలుగులు నింపుతానని, ధర్మ పోరాటం చేస్తున్నానని, తాను అవినీతి మీద పోరాటం చేస్తున్నానని.. ఇలా చంద్రబాబు డైలాగులు చెప్తున్నారు. చంద్రబాబుగారికి లోక కల్యాణం అంటే ఏమిటో తెలిసినట్టు లేదు. లోక కల్యాణం అంటే లోకంలోని ప్రజలకు మేలు చేయడం. ఒక్క ఆయన కుమారుడు లోకేశ్‌కు మేలు చేయాలనుకుంటే అది లోక కల్యాణం కాదు. 

మన రాష్ట్రంలో ఒక ప్రభుత్వం నిలబడటానికి 148 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలం 146 మాత్రమే, అది కూడా అసమ్మతి ఎమ్మెల్యేలను కూడా కలుపుకొంటే. మరి మైనార్టీలో ఉన్న ఈ కాంగ్రెస్ ఎలా అధికారంలో ఉంది? కిరణ్‌కుమార్‌రెడ్డి ఎలా పరిపాలన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మద్దతుతో కాదా?
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు తాను లోక కల్యాణం కోసం పాటుపడుతున్నానని అంటున్నారు. రెండెకరాల భూమితో రాజకీయ జీవితం ప్రారంభించిన చంద్రబాబు లోకాన్ని దోచుకొని కోట్లకు కోట్లు సంపాదించారు. ఇప్పుడు ఆ ఆస్తుల్ని లోకేశ్‌కు ఇస్తారు. ఆయన్నే నమ్ముకొని, జెండా పట్టుకున్న కార్యకర్తలను మాత్రం పార్టీ కోసం ఆస్తులు అమ్ముకొమ్మని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడూ.. మీ దృష్టిలో లోక కల్యాణం అంటే లోకేశ్‌కు మేలు చేయడమేనా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. ‘‘తెలుగుదేశం పార్టీని కబ్జా చేసి, నందమూరి కుటుంబాన్ని తొక్కేసి, ఒక్క లోకేశ్‌ను మాత్రమే పైకి తేవాలనుకుంటే అది లోక కల్యాణం అనిపించుకోదు’’ అని చంద్రబాబుకు ఆమె హితవు పలికారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ప్రజాస్వామ్య విరుద్ధంగా దానితో కుమ్మక్కైన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాలో పూర్తయి.. తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. రాజమండ్రిలో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. 

ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

‘‘ఈ రోజు చంద్రబాబు ఎన్నో సినిమా డైలాగులు చెప్తున్నారు. చంద్రబాబు తనకు స్వార్థం, పదవీ వ్యామోహం లేవంటున్నారు. అయితే మరి ఎన్టీఆర్‌ను ఆయన ఎందుకు వెన్నుపోటు పొడిచినట్టు? ఆయన కుర్చీని, అధికారాన్ని ఎందుకు లాగేసుకున్నట్టు? పోనీ ఆయన్ను అధికారంలోంచి దింపేశాక, ఎన్టీఆర్ గారికి అంత మంది కుమారులుంటే.. ఏ ఒక్క కుమారుడికీ అధికారం ఇవ్వకుండా అందరినీ తొక్కేసి ఆ కుర్చీలో చంద్రబాబుగారే ఎందుకు కూర్చున్నట్టు? ఈయనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదని చెప్పినా.. ఆ కుర్చీ మీద కన్నులేదని చెప్పినా కనీసం తెలుగుదేశంవారు కూడా నమ్మరు. నిజంగా మీరురాష్ట్రంలో వెలుగులు నింపే వారే అయితే అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో ఆ పని ఎందుకు చేయలేదు చంద్రబాబూ? నీ హయాంలో రాష్ట్ర ప్రజల బతుకులు ఎందుకు బుగ్గిపాలు చేశారు?

నరకాసురుడికి అధికారం ఇస్తారా?

‘నాకు అధికారం ఇస్తే రాష్ట్రాన్నే కాదు, దేశాన్నే గాడిలో పెడతాను’ అంటున్నారు చంద్రబాబు. నరకాసురుడు వచ్చి తనకు మళ్లీ అధికారం ఇవ్వండి.. మంచి పాలన చేస్తానంటే ఎవరైనా ఇస్తారా? గాడ్సే వచ్చి మహాత్మాగాంధీ ట్రస్టుకు తనను అధ్యక్షుడిని చేయమంటే చేస్తారా? చంద్రబాబుకు మళ్లీ అధికారం ఇస్తే మన రాష్ట్రానికి అధోగతే. చంద్రబాబు అవినీతి మీద ధర్మ పోరాటం చేస్తున్నారట. కనీసం ప్రజలు చూస్తున్నారని కూడా పట్టించుకోకుండా, ఎమ్మార్, ఐఎంజీ కేసుల్లో విచారణను తప్పించుకోవడానికి చీకట్లోనే చిదంబరాన్ని కలిసి ఒక వైపు వ్యవస్థలను మ్యానేజ్ చేసుకుంటూ.. తనది ధర్మ పోరాటం అంటున్న చంద్రబాబును ఏమనాలి?

కుమ్మక్కైంది టీడీపీనే..

కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు ప్రతిసారీ కుమ్మక్కయ్యారు. పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైందని ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆయన చెప్పిందే నిజమైతే.. ఈ రోజు జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో ఉండేవారా? ఇప్పటికే ఏ మంత్రో, ముఖ్యమంత్రో అయిపోయి ఉండేవారు కాదా? ఈ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై జగన్‌మోహన్‌రెడ్డి మీద అబద్ధపు కేసులు పెట్టి ఏడాదిగా జైల్లో పెట్టేలా చేశాయి. చేతగాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అన్ని ప్రతిపక్ష పార్టీలూ కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈగ కూడా వాలకుండా చేయడానికి ఈ చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి మరీ కాపాడారు.

జగనన్న తరఫునే ఈ పాదయాత్ర..

నాన్నగారు బతికే ఉన్నా.. జగనన్న బయటే ఉన్నా.. నేను ఈ రోజు ఈ పాదయాత్ర చేసే అవసరమే వచ్చేది కాదు. కానీ వైఎస్సార్ పాదయాత్రలో, ఆయన వ్యక్తిగత ఇమేజ్‌తో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ కనీసం కృతజ్ఞత కూడా లేకుండా వైఎస్సార్‌ను దోషి అని, ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరును చేర్చింది. ఆయన కుమారుడిని రాజకీయంగా తొక్కేయాలని ఒక్కడి చుట్టూ 100 కుట్రలు పన్ని కేసులు పెట్టి జైల్లో పెట్టేలా చేసింది. జైల్లో ఉండి కూడా మన రాష్ట్ర ప్రజల గురించే ఆలోచిస్తున్న జగనన్న తర పున నేను ఈ రోజు పాదయాత్ర చేస్తున్నాను. అందుకే ఈ రోజు ఇలా మీ ముందు నిలబడ్డాను.’’
- See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=612077&Categoryid=1&subcatid=33#sthash.9Wpk7kzh.dpuf

No comments:

Post a Comment