6/10/2013 1:52:00 AM
ప్రజా సమస్యలతోపాటు కాంగ్రెస్, టీడీపీ మిలాఖత్‌పై నిరసన
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేయడంతో పాటుగా కాంగ్రెస్, టీడీపీ మిలాఖత్ రాజకీయాలను ఎండగడతామని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం వెల్లడించింది. మొత్తం 14 అంశాలపై అసెంబ్లీలో గళం విప్పి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షం ఉప నాయకురాలు మేకతోటి సుచరిత, కార్యదర్శి తెల్లం బాలరాజు, కో-ఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆదివారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు సమస్యలతో అల్లాడుతూ ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో లేవనెత్తనున్న 14 అంశాలివీ.. గ్రామాల్లో కరెంటు కోతలతో రాజ్యమేలుతున్న చీకట్లు, పరిశ్రమలకు విద్యుత్ కోతలతో ఉపాధి కోల్పోతున్న కార్మికులు, సర్ చార్జీల పేరుతో దారుణంగా బాదుతున్న విద్యుత్ బిల్లులు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా. జలయజ్ఞం మీద ప్రభుత్వ నిర్లక్ష్యం. తాగునీటి సరఫరా లేక ప్రజల ఇబ్బందులు. రైతులకు మంజూరుకాని రుణాలు, విత్తన సరఫరా, గిట్టుబాటు ధరలు లేక సంక్షోభంలోకి పోతున్న వ్యవసాయం, రైతన్నల ఆత్మహత్యలు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, అమ్మ హస్తంలో అవకతవకలు, ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో అక్రమాలు బెల్టు షాపుల రద్దు. ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి పెంపు, ప్రభుత్వోద్యోగాల భర్తీ, ఏపీపీఎస్సీలో జరుగుతున్న అక్రమాలు. ఆర్భాటంగా పథకాలను ప్రకటించడమే కానీ అమలు చేయలేని పరిస్థితి. ఇందిరా క్రాంతి పథకం యానిమేటర్లు, అంగన్‌వాడీ మహిళల సమస్యలు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం చేసినా నిధుల దారి మళ్లింపు. ప్రభుత్వాసుపత్రుల్లో రోగుల ఇక్కట్లు, 108, 104 మూల పడుతున్న వైనం. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం అవలంబిస్తున్న మిలాఖత్ రాజకీయాలు. |
No comments:
Post a Comment