Tuesday, 11 June 2013

అన్ని చార్జిషీట్లను కలపలేం

6/11/2013 1:56:00 AM
సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో ఇప్పటివరకు సీబీఐ సమర్పించిన అన్ని చార్జిషీట్లనూ కలిపి తుది విచారణ (జాయింట్ ట్రయల్) చేపట్టాలని కోరుతూ సీఆర్‌పీసీ సెక్షన్ 223 కింద వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఒక్కో చార్జిషీట్‌ను వేర్వేరుగా పరిగణిస్తున్నందున, అన్నింటిని కలిపి విచారించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఒక్కో చార్జిషీట్‌ను వేర్వేరుగానే పరిగణించాలని హైకోర్టు స్పష్టంగా చెప్పిందని, తాను అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని ప్రధాన న్యాయాధికారి యు.దుర్గాప్రసాదరావు తీర్పులో పేర్కొన్నారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ ఇప్పటివరకు ఐదు చార్జిషీట్లను దాఖలు చేసింది. వీటన్నింటినీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వేర్వేరుగా విచారణకు స్వీకరించింది. విచారణ ప్రక్రియను కూడా మొదలుపెట్టింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అన్ని చార్జిషీట్లను కలిపి తుది విచారణ చేపట్టాలంటూ వైఎస్ జగన్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు.

సీబీఐ పిటిషన్‌పై విచారణ 19కు వాయిదా...

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డిలను వేర్వేరు జైళ్లలో ఉంచాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు తమకు సమయం కావాలంటూ జగన్ తరఫు న్యాయవాది కోరడంతో ప్రధాన న్యాయాధికారి దుర్గాప్రసాదరావు అందుకు అంగీకరిస్తూ విచారణను 19కి వాయిదా వేశారు. వాన్‌పిక్ వ్యవహారంలో ధర్మాన ప్రసాదరావు చర్యలను అవినీతి నిరోధక చట్టం కింద విచారణకు స్వీకరించాలంటూ సీబీఐ దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ కూడా ఈ నెల 13కు వాయిదా పడింది.

సబిత, ధర్మానలకు నోటీసులు...

దాల్మియా సిమెంట్స్, వాన్‌పిక్ వ్యవహారాల్లో నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు సబిత ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం నోటీసులు జారీ చేసింది. సబిత, ధర్మాన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని, సాక్ష్యాలను తారుమారు చేస్తారని, ఈ దృష్ట్యా వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోరుతూ సీబీఐ దాఖలుచేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయాధికారి యు.దుర్గాప్రసాదరావు సోమవారం మరోసారి విచారించారు. మంత్రుల వ్యాఖ్యలకు సంబంధించి కోర్టు ముందు ఉంచిన సీడీల్లోని సమాచారాన్ని లిఖితపూర్వకంగా దాఖలుచేయాలని సీబీఐ అధికారులను ఆదేశించారు. అలాగే సీబీఐ పిటిషన్‌పై స్పందించాలని ఆదేశిస్తూ సబిత ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈనెల 12కు వాయిదా వేశారు.
- See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=616050&Categoryid=1&subcatid=33#sthash.iF7BQEWM.dpuf

No comments:

Post a Comment