Tuesday, 11 June 2013

దూసుకు వెళుతున్న జగనన్న బాణం

6/11/2013 2:01:00 AM
సాక్షి, రామచంద్రపురం :ఏ ఊరైనా, ఏ వాడైనా- అదే జనాదరణ..అదే ఆప్యాయత..అదే ఉత్సాహం.. ఉత్తుంగతరంగాలై ఉరకలెత్తుతున్నాయి. ‘జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ ఆయన సోదరి షర్మిల సాగిస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’ జిల్లాలో మరోచరిత్ర సృష్టిస్తోంది. పల్లె, పట్టణాలనే తేడా లేకుండా ప్రతి చోటాప్రజలు రాజన్న బిడ్డను అక్కున చేర్చుకుంటున్నారు. ఆమె వెంట నడిచేందుకు పోటీపడుతున్నారు. ఆమె మాటలు వినేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. పాదయాత్ర జిల్లాలో రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ వద్ద ప్రారంభమైన నాటి నుంచి గత ఏడురోజులుగా జరిగిన సభలు, రచ్చబండలు ఒక ఎత్తయితే రామచంద్రపురంలో సోమవారం రాత్రి జరిగిన బహిరంగసభ ఒక ఎత్తు. జిల్లా చరిత్రలో ఈ తరహా సభకు ముందెన్నడూ లేని రీతిలో జనం ఉప్పెనలా తరలి వచ్చారు. పసలపూడి వద్ద బైపాస్ జంక్షన్‌లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించింది మొదలు బస చేసే ప్రాంతం వరకు షర్మిలను సుమారు రెండు కిలోమీటర్ల మేర జనప్రవాహం అనుసరించింది. ఇక బహిరంగ సభ జరిగిన రామకృష్ణ సెంటర్‌కు ఇటు ఎల్‌ఐసీ భవనం నుంచి అటు రాజగోపాల్ సెంటర్ వరకు సుమారు కిలో మీటరన్నర మేర ఇసుకేస్తే రాలనంత జనంతో మెయిన్‌రోడ్డు కిక్కిరిసిపోయింది. నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి జనం పోటెత్తారు.

‘జై బోస్.. జై జగన్’
మాటతప్పని, మడమతిప్పని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, నైతికవిలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌లకు తామెప్పుడూ అండగా ఉంటామని రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు మరోసారి నిరూపించారు. సభకు తరలివచ్చిన జనప్రభంజనం అధికార, ప్రధాన ప్రతిపక్ష నేతల వెన్నులో వణుకు పుట్టించింది. జనం మధ్య తిరిగే జగనన్నను కుట్రలు, కుతంత్రాలతో జైలు పాలు చేశారంటూ బోస్ తన ప్రసంగంలో ఉద్వేగంగా అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచారనడానికి ఇక్కడకు వచ్చిన జనమే సాక్ష్యమన్నారు. షర్మిల తన ప్రసంగంలో గతేడాది జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్- టీడీపీల కుమ్మక్కు రాజకీయాలతోనే బోస్ ఓటమి చెందారనగానే ప్రజల హర్షధ్వానాలు మిన్నంటాయి. 2009 ఎన్నికలల్లో బోస్‌కు 53 వేల ఓట్లు వస్తే ఉపఎన్నికల్లో 65 వేల ఓట్లు వచ్చాయని, అంటే ప్రజల అభిమానం పెరిగిందేతప్ప తగ్గలేదన్నారు. టీడీపీ అభ్యర్థికి ఇక్కడ కేవలం 6,300 ఓట్లు వచ్చాయంటే కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనమేమిటని, దీనికి ఆ పార్టీ ప్రజలకు జవాబు చెప్పాలని అనగానే ప్రజలు ‘జై బోస్..జై జగన్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

కదలి వచ్చిన పల్లెలు
మండపేట శివారు కేపీ రోడ్డు జంక్షన్ సమీపంలో బస చేసిన ప్రాంతం నుంచి సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ఏడవ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. మారేడుబాక, పులగుర్త, మాచవరం, పసలపూడిల మీదుగా రామచంద్రపురం మెయిన్‌రోడ్డులోని సూర్య కాంప్లెక్స్ వరకు సాగింది. పల్లెలకు పల్లెలు కదలి వచ్చాయా అన్నట్టు షర్మిల వెంట కదం తొక్కారు. పులగుర్త, మాచవరం గ్రామాల్లో షర్మిలను పూలబాటపై నడిపించి అభిమానాన్ని చాటుకున్నారు. మార్గమధ్యంలో ఉన్న వైఎస్, అంబేద్కర్ విగ్రహాలకు షర్మిల పూలమాలలు వేసి నివాళులర్పించారు. మారేడుబాక-పులగుర్త మధ్యలో షర్మిల ఇటుక బట్టీ కూలీల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. బతకడానికి కష్టంగా ఉందంటూ పులగుర్తకు చెందిన కడింపల్లి లక్ష్మి అనే వికలాంగురాలు మొరపెట్టుకోగా మంచిరోజులొస్తాయని ధైర్యం చెప్పారు. ఇటీవల ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన తోటకూర పెదకాపు రోడ్డుపక్కనే కూర్చుని ఉండగా షర్మిల పరామర్శించారు. నడవలేకపోతున్నాడని,

ఆయనే మాకుదిక్కని, ప్రభుత్వాస్పత్రిలో వైద్యం అందడం లేదని అతని భార్య లక్ష్మి అనగానే పక్కనే ఉన్న అనపర్తి కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డిని పిలిచి పూర్తి స్థాయిలో వైద్యం చేయించమని పురమాయించారు. చివరగా పలసపూడి వద్ద రామచంద్రపురం బైపాస్ జంక్షన్‌లో నిలువెత్తు భారీ వైఎస్ కాంస్య విగ్రహాన్ని వేలాది మంది ప్రజల సమక్షంలో ఆవిష్కరించారు. ‘వైఎస్సార్ అమర్ రహే...వైఎస్సార్ అమర్హ్రే’ అంటూ ఆ ప్రాంత మంతా నినాదాలతో హోరెత్తింది. పాదయాత్ర రామచంద్రపురం మెయిన్‌రోడ్డు మీదుగా రాత్రి ఏడున్నర గంటలకు సూర్య కాంప్లెక్స్ స్థలంలో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకుంది.

రాజన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన షర్మిల
పసలపూడి(రాయవరం), న్యూస్‌లైన్ : మండలంలోని పసలపూడి- రామచంద్రపురం బైపాస్ రోడ్డు జంక్షన్‌లో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని షర్మిల సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. మధ్యాహ్న విరామం అనంతరం మాచవరం నుంచి పసలపూడి వచ్చిన షర్మిలకు పసలపూడివాసులు ఘనస్వాగతం పలికారు. షర్మిలను చూసేందుకు దారిపొడవునా ప్రజలు బారులు తీరారు. సుమారు ఏడు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని షర్మిల ప్రారంభించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. షర్మిలను చూసేందుకు వచ్చిన అభిమానులతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. ఆధునీకరించిన జాతీయ పంటల బీమా పథకం పేరుతో 4.5 శాతం రైతులు కడితే ప్రభుత్వం 4.5 శాతం కడుతోందని, దీనివల్ల రైతులు అధికశాతం భీమా ప్రీమియం కట్టాల్సి వస్తుందని నీటిసంఘాల రాష్ట్ర కార్యదర్శి త్రినాధరెడ్డి షర్మిలకు వివరించారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బసవా చినబాబులు రైతు సమస్యలను షర్మిల దృష్టికి తీసుకుని వెళ్లారు.

No comments:

Post a Comment