Monday, 27 May 2013

The Real Hindu


ఒక రమణీయ జీవిత కావ్యం.... 'అమ్మ ఒడిలోకి పయనం'...

    'అందరి జీవితం గురించి అందరూ తెలుసుకోనవసరం లేదు, కాని కొందరి గురించి మాత్రం అందరూ తెలుసుకొనే తీరాలి'. ఈ నానుడికి సరిగ్గా అతికినట్టు సరిపోయే పుస్తకమే 'అమ్మ ఒడిలోకి పయనం..'. రాధానాధ్‌ స్వామి అనే సాధారణ యువకుడి జీవితంలో జరిగిన అసాధారణ సంఘటనల సమాహారమే ఈ పుస్తకం. రిచర్డ్‌ అనే అమెరికన్‌ యూదు యువకుడు భగవంతుని గురించి చేసే అన్వేషణలో వేసిన అడుగులు, వివిధ సంఘటనలు చివరికి రాధానాధ్‌ స్వామిగా ఎలా మారాడన్నదే ఈ పుస్తక సారాంశం.

    రిచర్డ్‌ ఒక సాధారణ అమెరికన్‌ యూదు యువకుడు. చిన్నతనం నుండి యూదుల పట్ల క్రైస్తవులకు సహజంగా ఉండే ద్వేషాన్ని, అవమానాన్ని ఎదుర్కొంటాడు. దానికి తోడు ఇంట్లో తల్లిదండ్రులు దేవుని పట్ల కృతజ్ఞతగా ఎలా ఉండాలో నేర్పుతారు. 1960ల్లో అప్పుడే అమెరికా యువతలో మొదలైన హిప్పీ సంస్కృతి (దేశ దిమ్మరులు అనవచ్చును), ఇవన్నీ రిచర్డ్‌ను ఏ మార్గాన్ని ఎంచుకోవాలో తెలియని కూడలిలో ఉంచుతాయి. కాని ఆ యువకుడు ఎవరి మాటను వినక, తన అంతరాత్మ ప్రబోధంతో ప్రపంచంలో ఉన్న అన్ని మతాల గ్రంధాలని చదువుతాడు. కాని దేవుడి గురించిన భావనలు ఆయన్ని అయోమయంలో పడేస్తాయి. ఈ అయోమయంలో నుంచి బయట పడే మార్గం.. ప్రపంచ పర్యటన మాత్రమే అని నమ్ముతాడు. ఆ విధంగా అమెరికా నుండి స్నేహితుడు 'గేరి'తో కలిసి బయలుదేరి, లండన్‌, ఫ్రాన్స్‌ మీదుగా, ఇటలీ చేరుకుంటారు. రోమ్‌ను సందర్శిస్తారు. ఎంతో మంది క్రైస్తవ మతపెద్దల్ని కలుసుకుని, ఎన్నో చర్చిల్లో ప్రార్థనలు చేస్తారు. కాని ఆయన మనసుకు సమాధానం లభించదు. చివరకు ఆయన ప్రశ్నలకు సమాధానం దొరికేది కేవలం 'భారతదేశం'లో మాత్రమే అని ఒక దివ్యవాణి ఆయనకు అంతరాత్మలో ప్రబోధిస్తుంది. అక్కడి నుండి భూమార్గం ద్వారా భారతదేశం చేరుకునే ప్రయత్నంలో ముస్లిం దేశాల్లో ప్రయాణం, అక్కడ ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు మనల్ని కలిచివేస్తాయి. పుస్తకం చదువుతున్నంత సేపు రిచర్డ్‌తో పాటు మనం కూడా ప్రయాణిస్తూ, ఆయన పడుతున్న బాధల్ని, కష్టాల్ని మనం కూడా కలిసి ఎదుర్కొంటున్నట్లుగా అనిపిస్తాయి.

    తనకి అసలెన్నడూ పరిచయం లేని ఒక 'అపరిచిత దేశం' గురించి రచయిత మాటల్లోనే... ''ప్రతి మైలూ ముందుకు పోతున్నపుడు, నా హృదయం పవిత్రమైన భారతభూమి వైపు విహరించసాగింది. ఆ భూమితో సమాగమం జరుగకుండా నేను బ్రతకలేనని నాకు మొదటి నుండి తెలుసు. భారత భూమి కోసం పరితపించాను. నా హృదయపు లోతుల్లోని బలమైన కోరిక ఇప్పుడు నిజమయ్యేటట్టుగా ఉంది''.

    అలా భారతదేశం చేరుకున్న రిచర్డ్‌, దేశంలోని వివిధ ప్రాంతాల సందర్శన, హిమాలయ యోగులతో సహవాసం, గంగానది ఒడ్డున ఒంటరి వాసం, ధ్యానం, హిమాలయ పర్వత సానువుల్లో ఆయన చూసిన యోగుల అద్భుత విన్యాసాలు.... ఇవన్నీ చదువరులను కట్టిపడేస్తాయి. మనమెన్నడూ చూడని అద్భుత లోకాలని తీసుకువెళతాయి. అక్షరాల వెంట మనసును పరుగులు తీయిస్తాయి. అన్నిటి కన్నా ముఖ్యంగా బృందావనంలో ఘనశ్యామ్‌ బాబా వృత్తాంతం ఎంతటి వారికైనా కళ్ళవెంబడి నీళ్ళు చిప్పిల్లజేస్తుంది. అంతటి కరుణాత్మకంగా సన్నివేశ చిత్రణ ఒక విదేశీయునికి ఎలా సాధ్యమయిందో నాకు ఎన్నటికీ అర్థం కాదు. కృష్ణుని ప్రేమలో మునిగి తేలిన బృందావనంలో భగవంతుని పట్ల ప్రేమను ఏదో ఒక మత పరమైన కర్మకాండగా కాకుండా, ప్రదర్శన యోగ్యమైన క్రతువుగా కాకుండా, తమ జీవిత విధానంగా మార్చుకుని, తమ దైనందిన జీవితంలో, ఒకరినొకరు 'రాధేశ్యామ్‌' అని పలకరించుకోవడం చూసి, రచయిత ఉద్వేగానికి లోనవుతాడు.వ్యాపార మతాల నుండి వచ్చిన వారికి ఈ దేశంలోని సహజమైన ప్రేమతో దేవుని ఆరాధించడం ఒకింత ఆశ్చర్యం కలిగించడం మనం గమనిస్తాము. 

    పుస్తకం మొదలు నుండి చివరి వరకు ఒక అపరాధ పరిశోధ నవల చదువుతున్న అనుభూతిని కలుగజేస్తాయి. ఆంగ్ల మూలం నుండి తెలుగులోకి అనువదించిన తీరు కూడా చాలా సరళంగా ఉంది. అక్కడక్కడ రచయితలోని హాస్య ప్రియత్వం, సున్నితత్వం కూడా గిలిగింతలు పెడుతూ రచన ముందుకు సాగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంలో రచయితలో ఎక్కడా దాపరికం గాని, మొహమాటం గాని చూడము. తన మనసులో ఉన్న ప్రశ్నలకి సమాధానం కోసం దారిలో ఎదరైన అన్ని రకాల యోగులు, గురువులు, స్వాములు, వివిధ మతాల పెద్దలు... ఇలా ఎంత మంది తమ దారిలోకి తెచ్చుకోవాలని చూసినా, మొండితనంతో, తెగువతో, తన నిజమైన దారిని కనిపెట్టడానికి, తన గురువును చేరడానికి ఆయన పడిన తపన, చదువరుల మనసుని కదిలింపచేస్తాయి. సత్యాన్వేషణ అంటే కేవలం తను నమ్మిన ఒక దారిలో వెళ్ళి, మిగతా వారిని విమర్శించడం కాదని, ప్రపంచం చాలా విశాలమైనదని, ఎన్నో రకాల భావాలు, ఆరాధనా పద్దతులు, ఆచారాలు, వీటన్నిటినీ మించి, రకరకాల మనుష్యులు... అన్నిటినీ తులనాత్మకంగా, పక్షపాత రహితంగా, సాక్షీభూతంగా పరిశీలించి, అప్పుడు మాత్రమే మన మనస్సుని భగవంతుని అధీనం కావించి, ఆయన చెప్పిన మార్గాన్నే అనుసరించాలనేది రచయిత సూచన. ఇది సర్వకాల సర్వావస్థలలోను అనుసరించదగ్గది. అందరూ ఇలా ఆలోచిస్తే, మనిషిగా పుట్టి, విచక్షణా జ్ఞానం ఉపయోగించిన వారందరికీ ఒకే మార్గం బోధపడుతుంది. సర్వమానవ సౌభ్రాతృత్వం సాకారమవుతుంది. పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ చదువదగిన మంచి పుస్తకం 'అమ్మ ఒడిలోని పయనం'

No comments:

Post a Comment